చిన్న పరిశీలన
నేనొక పిల్లాడిని ఒక చిన్న గాజు పెట్టెలో ఒక చీమను వేసి ఒక రెండు రోజులు పాటు కాస్త రెండు పంచదార పలుకులు వేసి బ్రతికెలా చూడమన్నాను. విజయవంతంగా తెస్తే ఒక 5Star ఇస్తా అన్నాను. వాడు రెండురోజుల తర్వాత విజయవంతంగా గాజు పెట్టెలో చీమను తెచ్చాడు. ఈ సారి పది చీమలు వున్న పెట్టె ఇచ్చాను. రెండు రోజుల తర్వాత ఆరు చీమలు తో తిరిగి వచ్చాడు, ఏమిటి అని ప్రశ్నిస్తే, రెండు పారిపోయాయి, రెండు చచ్చి పోయాయి అన్నాడు.ఈసారి వంద చీమలు ఉన్న పెట్టె ఇస్తే, వద్దు బాబోయ్, నీకు నీ చాక్లెట్ కు ఒక దణ్ణం అని పారి పోయాడు.
చీమ-మనిషి
కేవలం చీమ… దాన్ని ఉంచే ప్రదేశం, నియంత్రించే బలం సరిపోక పోతే, అవి బ్రతకవు, ఉండవు. మరి చీమల పుట్టలో వేలకొద్దీ ఎలా వుంటున్నాయి అని అడగచ్చు. ఏ ప్రాణి అయినా వాటి సహజ గుణం, ప్రదేశం నుంచి మార్చి నియంత్రిస్తే, అది తిరగబడుతుంది! చీమలు బుద్ధి జీవులు కాదు, వాటిల్లో అవి ఎలా వుండాలి అనేది ముందే నిర్ణయించ బడింది. అలాగే వుంటాయి. మనిషి బుద్ధి జీవుడు, బుద్ధి పరి పరి విధాల పోతుంది. స్వయం నియంత్రణ వుండాలి, లేదా నియంత్రించాలి. లేకపోతే పక్కవాడిని కూడా పీక్కుని తినేయగలడు.
సంతోషం పిల్లలు
మనం అర్థం చేసుకోవలసిన విషయాలు పలు వున్నాయి ఇక్కడ.మొదటగా, ఏ మనిషికి సంతోషం లేదు. చదువు చదివి పెద్ద ఉద్యోగం వస్తే సంతోషం వస్తుందని మొదట పరుగు. చదువు పరుగు పెట్టలేని వాడు ఏదో వ్యాపారం పేరుతో పరుగు. ఇద్దరికీ చేతి నిండా డబ్బు దొరుకుతుంది, సంతోషం దొరకదు. ఇక పెళ్లి చేసుకుంటే వచ్చే మనిషి సొంతోష పెడుతుందని/పెడతాదని ఒక లాటరీ టికెట్ కొంటాడు, ఆ లాటరీ తగలదు.పిల్లలు పుడితే సంతోషం రెండింతలు అవుతుందని పిల్లలు కంటారు, ఇంక కష్టాలు చెప్పక్కర్లేదు. తప్పక పిల్లల్ని పెంచుతారు, మళ్ళీ అదే వృత్తం పిల్లలకు రిపీట్!
మనకు ఒక చిన్న ఇల్లు ఉందనుకోండి, దానికి భోజనం చేసే చోటు అందరు కూర్చుని తినేలా ఏర్పాటు చేసుకుంటాము. లేదా సరిపోయే గది కొనటానికి ప్రయత్నిస్తాము. ఇల్లు సరిపొనప్పుడు, ఇంట్లో సరుకులు నిండుకున్నప్పుడు చుట్టాలని పిలవం కదా? కామన్ సెన్స్!బుద్ధి పరి పరి విధాల పోయే మనిషి ఉండే చోటు, నియంత్రించే బలగం లేనప్పుడు ఇంకా ఇంకా మనుషుల్ని ఆ ప్రదేశంలో చొప్పించడం అవివేకం, అమానుషం.
జూలో 14 వేల మంది, రైల్లో ముప్పై వేల మంది, రికార్డులా ఇవి?
అయ్యప్ప గుడిలో కిక్కిరిసి పోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్న భక్తులు, అలాగే హైదరాబాద్ జూ లో ఒకే రోజు కొన్ని వేల మంది రావటం ఒక రికార్డ్ గా చెప్పుకుంటున్నారు. రెండు కూడా మానవాళి సిగ్గు పడాల్సిన విషయాలు, మనకు పిల్లలు కనటం తప్ప వివేకమైన పనులు చేయటం, నియంత్రించుకోవడం చేతకాదు అని!మన జనాభా ఒక దుర్దశ కు చేరింది, పిల్లలు కనక పోతే, అందరూ ముసలి వాళ్ళు అవుతారు, కంటే కంచే తెంచుకుంటారు! దీనికి పరిష్కారం మన చేయి దాటిపోయింది, కానీ ప్రకృతి, కాలక్రమేణా చాలా ఘాటుగా ఇస్తుంది ! తస్మాత్ జాగ్రత్త!