దానం చెయ్యాలా, ఎందుకు చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి?

Share this with people you care for

మీతో మాట్లాడటం నాకు అత్యంత ఉత్సాహాన్నిస్తుందని చెప్పాలి. వినేవాడు దొరికితే, చెప్పేవాడు వేదాంతి అవుతాడని, చిన్నప్పటినుంచి మా అన్న ఒకడు అంటుండేవాడు. ఉపయోగ పడని మాటలు చెప్పకూడదు, అని ఆనాడే తీర్మానించుకున్నాను! మీరు బహుశా నేను అక్కర్లేని మాటలు చెప్తున్నాను అని అకోవట్లేదని భావిస్తాను! ఇక విషయం లోకి వస్తే,

ప్రతీ పౌరుడు కి ఆరు బాధ్యతలు వుంటాయి. 1) స్వయం పోషణ 2) కుటుంబ పోషణ 3) ధర్మ రక్షణ 4) సమాజ లేదా దేశ రక్షణ 5)ప్రకృతి పరి రక్షణ 6) దేశ సాంస్కృతిక అభివృద్ది, లేదా పరిరక్షణ . మనిషి యొక్క శక్తిని, యుక్తిని, సమయ, కాల, సందర్భాలను బట్టి 3,4,5,6 ల్లో రకరకాలుగా పాలు పంచుకోవాలిసి వుంటుంది. ఒక్క స్వయం పోషణ చేసుకునే వాడు స్వార్ధపరుడు, కుటుంబం మాత్రమే చూసుకుంటూ, అవసరానికి మించి సంపాదించేవాడు లోభి, ప్రతి మనిషి ఈ రెండు దాటి ప్రవర్తించాలి, అప్పుడు సమాజం చాలా సజావుగా సాగుతుంది. ధర్మ రక్షణకు, సమాజ రక్షణకు ప్రతి మనిషి యుద్ధానికి వెళ్లలేక పోవచ్చు, కానీ గాయాలు తగిలిన వాళ్ళకి మందులు రాయొచ్చుగా, దాహం వేసే వాడికి కాసిని మంచినీళ్లు, ఆకలి వేసే వాడికి పట్టెడు అన్నం. ఏ శక్తి లేనప్పుడు, వాడి సేద తీర్చచ్చు. అవునా కదా? ఈ నాలుగిటికి మద్దతుగా నిలిచేది, మనం స్వార్ధపరుడిగా, లోభిగా మారకుండా చూసేదీ, దానం

దానం అనే ఘటన వలన ఏం జరుగుతుంది

దానం ఎవరికి చెయ్యాలి అనేది నేడు ఒక సందిగ్ధంగా మారింది. మా అమ్మ, అర్హత ఎరిగి దానం చెయ్యి అనేది. అర్హత మరి ఎలా కనిపెట్టటం, కుదరదు కదా, అందుకని దానం మానేశాము, కానీ మనసు ఒక్కోసారి చలిస్తుంది, కానీ మళ్లీ “అర్హత” గుర్తొస్తుంది. ఇలా ఎన్ని పర్యాయాలు జరిగాయో! మళ్లీ నేను మా గురువుల అనుగ్రహం అయ్యాక, మళ్ళీ దీనిమీద ఆలోచన మొదలుపెట్టి తర్కించి ఈ విధంగా తెలుసుకున్నాను! ముందుగా దానం లో దాగున్న పర్యవసానాలు ఇవి

  1. పొందిన మనిషి లేదా సమూహం, లేదా ప్రాణి, లేదా ప్రాణులకు సంబంధమైన మానసిక, శారీరిక, పరిసరాల పరిస్థితి మెరుగు పడటం
  2. చేసిన వారి మానసిక పరిస్థితి మార్పు
  3. చేసిన వారి ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు పడటం

అంటే, రంతి దేవుడిలా ఉన్నదంతా దానం చేసుకు పోవాలా?కాదు, (ఈ కధ తెలియకపోతే, ఇక్కడ చదవండి)

దానం నేర్చుకుంటే వచ్చే గుణం కాదు, ప్రాణుల జీవిత సంఘర్షణ చూసి మనకు కలిగిన భావోద్వేగం నుండి జాలువారిన మన స్పందన దానం. నిజంగా మన దగ్గర ఏమీ లేకపోతె, నిజంగా అశక్తులమైతే ఒక కన్నీటి బొట్టు జాలువారితే, అది దానం.

కన్నీటి వలన ఆశించిన వారి పరిస్తితి లో మార్పు రాకపోవచ్చు, కానీ ఆ బొట్టు రాల్చిన మనం ఒక మనిషిగా ఉద్ధరింపబడి మానసికంగా ,అధ్యాత్మికంగా మనలో అనేక మార్పులు కలుగుతాయి. చేతనంగా (అంటే తెలిసి) సాధన చేస్తే,(దానం చేసే సాధన కాదు మనస్సు స్పందించే సాధన చేస్తే), దానం చేయాలా, ధర్మం చేయాలా, వద్దా అనేది, ప్రక్రుతి మీకు ఆ క్షణం స్ఫురణకు వచ్చేలా చేస్తుంది.

దానం నేర్చుకునే గుణం కానప్పుడు, నేను ఇక్కడ ఎం చర్చిస్తున్నాను, నేర్పుతున్నాను ? నేనేమీ నేర్పట్లేదు, దానం గురించి అవగాహన కలిగిస్తున్నాను. అందులో భావోద్వేగాలు, మీకు కలిగితే, మీరు అయోమయంలో, సందిగ్ధంలో పడి కొట్టు మిట్టాడకుండా, సరైన దిశ మీకు కనపడే ప్రయత్నం, నేను చేస్తున్నాను!

ధర్మాత్ములకు ధానం

ఇప్పుడు ఎవరికి దానం చెయ్యాలి? మొదటగా, నిర్మొహమాటంగా, ధర్మ మార్గంలో నడుస్తూ, పేదరికాన్ని అనుభవిస్తున్న వారికి వెతికి మరీ వీలైనంత దానం చేయటం ధర్మం. ఇంతకంటే గొప్ప దానం మరొకటి లేదు. ఎందుకంటే, “ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది” అనే నానుడి వేల సంవత్సరాల నుంచి వింటూనే వున్నాం! ఇది అర్హత ఎరిగి దానం చేయటం (తెలిసున్న మనుషులు, సందర్భాలు)
మిగిలిన కష్టాల్లో వున్న, నీచమైన గుణాలు లేని వారికి, నిరభ్యంతరంగా చేతనైన సహాయం చేయచ్చు. మరి “హిపోక్రిటిక్ ఓత్” అని డాక్ట్రర్ల చేత ఒక ప్రతిజ్ఞ చేయిస్తారు, దాని అర్ధం, పేషెంట్ ను “మంచి-చెడు” అని చూడకు, వైద్యం చేయి అని. అది వైద్యుల ధర్మం కావచ్చు. కానీ నీచ గుణాలు (మనకు నచ్చనివి కాదు, ధర్మానికి ఎదురేగేవి, సమాజ హితం కానివి) ఉన్నాయని తెలిస్తే, దానం చేయకండి, అది సమాజ హితం కాదు! ఇది అర్హత ఎరిగి దానం చేయకపోవటం (తెలిసున్న మనుషులు, సందర్భాలు)! ఇప్ప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న, మరి బిచ్చగాళ్ళు సమాజ హితులా? చదవండి క్రింద!

బిచ్చగాళ్లు, రకాలు, వారికి దానం

ఇప్పుడు బిచ్చగాళ్లను చూద్దాం. బిచ్చగాళ్ళు ఐదు రకాలు, 1) ధర్మం అడిగే నిజమైన సన్యాసులు! 2) అంగవైకల్యం వల్ల, కలహాల, దౌర్జన్యాల వల్ల, మానసిక స్థితి బాగా లేక, కుటుంబాలు, సమాజం వదిలి వేయబడ్డ వాళ్ళు 3) ఆర్ధిక పరిస్థితి నెమ్మదిగా దిగజారి పేదరికంలోనుంచి, బిచ్చం లోకి జారిపోయిన వాళ్ళు 4) మనకు తెలియక ఎప్పటినుండో తరతరాల బిచ్చగాళ్ళు 5) దొంగలు, దొంగ సన్యాసులు. ఇంతే కాక ఆపదలో చిక్కుకుని, సహాయం అర్థిస్తున్న వాళ్ళు వున్నారు, ఇవి కాకుండా, ఎన్నో NGO లు, Trust లు , Foundation లు వున్నాయి, వాటిల్ని తర్వాత చూద్దాం.

గుర్తు పెట్టుకోండి, ఒక కొయ్య బొమ్మలు మాత్రమే చేసే ఒక వడ్రంగి, ఆధునిక యుగంలో, ఎవరు ఆ బొమ్మలు కొనక, నెమ్మదిగా పేదరికంలోకి, అటు పిమ్మట బిచ్చం ఎత్తుకోవటం లోకి వెళ్ళిపోవటం ఎంతో మంది మనలో పెద్దవాళ్లకు తెలియదా? అతను చేసిన తప్పు ఏంటి? సమాజం పెట్టె పరుగును అందుకోలేకపోవటమా? అలాగే, ఒక వూరిలో కూల్ డ్రింక్స్ కంపెనీ పెట్టి, నీరు తోడేస్తే, పంటలకు నీళ్లు లేక పంటలు ఎండిపోయి, ఉన్న నేల అమ్ముకుని బిచ్చం ఎత్తుకునే స్థాయికి వచ్చిన రైతు, తప్పు ఏమిటి?
రిక్షా తొక్కి ధర్మంగా సంపాదించే ఒక కష్ట జీవి, రిక్షాలు లేక, ఆటోలు వస్తే, ఆటో కొనుక్కునే డబ్బు లేక, బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వస్తే, అతని తప్పు ఏమిటి? ఇవన్నీ మనం చూసీ చూడనట్టు, మనం బాధ్యులు కానట్టు ఎవరో వస్తారు, ఎదో చేస్తారు అని వదిలేస్తాము, కానీ ఆ విషమ పరిస్థితిలో మనం ఉంటే, మనకు లోతుగా అర్ధం అవుతుంది, దీనికి కారకులు ఎవరు అనేది.
మీ దగ్గరకు ఒక బిచ్చగాడు, ఒక సన్యాసి వస్తే, వాళ్ళని (5) అని తేల్చటానికి మీకు ఉన్న అర నిముషం సరిపోదు. పైగా, వచ్చిన వాళ్ళల్లో అలాంటి వాళ్ళు వచ్చే ప్రాబబిలిటీ 1/5 (మీరు ప్రాబబిలిటీ చదివి ఉంటే). అలాగే (4) కూడా మీరు చిటికెలో తేల్చలేరు, ఈ రెండు కలిపి 2/5 ప్రాబబిలిటీ.

A . మిగిలిన వాళ్ళల్లో, హైందవ ధర్మాన్ని కాపాడాలని మీకు ఏ కోశానవున్నా సన్యాసులను ఆదరించాలి, దానం తప్పక చేయాలి, వాళ్ళలోంచే, జ్ఞానులు పుడతారు, తర్వాత తరాలకు దిశ నేర్పగలుగుతారు. ఇది మన ధర్మం, ఆధ్యాత్మికం! నిజమైన సన్యాసులు బిచ్చగాళ్ళు కాదు, మనం చేసేశాము వాళ్ళని!
B ఇక (2)(అంటే, అంగవైకల్యం, ఆరోగ్యం, మానసిక దౌర్బల్యం వలన వీధిపైకి వచ్చిన వారు). జాలి వలన, మన మనః స్పందన వలన చేయవలిసిన దానం, మన శక్తి కొలది (ఇది మనస్సుకు, ఆధ్యాత్మిక ప్రయాణానికి ఉపయోగ పడేది)
C ఇక (3)(ఆర్ధికంగా నెమ్మదిగా వెనకబడి, పేదరికంలోంచి బిచ్చంలోకి నెట్టబడిన వాళ్ళు) ఎవరైనా తన తప్పు లేకుండా పేదరికంలో నెట్టబడుతున్నారు అంటే, ఆ పేదరికం, మరొకడికి ఆర్థికాభివృద్ధి అని అర్ధం. దానికి సమాజమే బాధ్యత వహించి చేతనైన సహాయం చేయాలి, ఇది మానవతా ధర్మం (మనస్సుకు , ఆధ్యాత్మిక ప్రయాణానికి ఉపయోగ పాడేది)
D ఇక (4)(తరతరాల నుంచి బిచ్చం ఎత్తుకునే వాళ్ళు) ఇది సందిగ్దమైన పరిస్థితి. మీ మనసు ఎం చెప్తే అది చేయండి. ఎందుకంటే కారణాలు తెలియదు కనుక. వారు అలా అవటానికి కారణం సగం సమాజం, నాయకులే!

ఆపదలో ఆదుకోవటం

అలాగే ఆపదలో వున్న వారిని, లేదా ప్రాణులను ఆదుకోవటం సమాజ శ్రేయస్కర కార్యం, ఇది బిచ్చం కాదు, అవసరానికి సహాయం. అనురాగం, బంధు ప్రీతి లేనిచోట ఇది మనం కనబరిస్తే, మన మానవత్వం ఎంతో మనకు గోచరిస్తుంది. మన మానసిక స్తితి బాగుండటానికి, అధ్యాత్మికంగా ఉద్ధరింపబడటానికి మంచిదే. ఇక, నా దృష్టిలో చదువుల కోసం సహాయం కోరటం అవివేకం. చదువులు చదివించలేనప్పుడు, గవర్నమెంటు బడిలో వేయాలి, చదివే సత్తా లేనప్పుడు ఏదైనా పని నేర్పాలి, చదువు కోసం అందరిని అర్ధించకూడదు. ధర్మ మార్గం విడిచినవాళ్లు, ఇక మరొకటి, తాగుబోతులు స్వామి వేషం వేసుకుని శబరిమల వెళ్తాను డబ్బు దానం చేయమంటారు, లేదాతీర్థ యాత్రల కోసం ఆర్ధిస్తే, … ఇది సరైన పధ్ధతి కాదు, వీళ్ళు ధర్మ మార్గంలో లేరు, వీళ్ళకి సహాయం చేయక్కర్లేదు. ధర్మంలో నిలదొక్కుకున్నాక చేయచ్చు … అయినా, మీకు నచ్చితే చేయండి, దానం లోకి రాదు! మీరు అవతలి వాళ్ళను ఉద్ధరించటానికి సహాయ పడుతున్నారు. మీకు నచ్చితే మంచిదే.

ఏది ఏమైనా. ఒక మనిషి, ఇంకొక మనిషిని అభిమానం చంపుకుని, నోరు తెరిచి అడిగాడు అంటే, ఎదో చెప్పలేని ఇబ్బంది వుంది ఉండాలి. అది నిజామా, ఉత్తిదా, పక్కన పెట్టి, మీ మనస్సు స్పందిస్తే, దానం చేయండి, లేకపోతె, ముందుకు జరగండి. దయచేసి, అవమానించకండి. మనసులో మీ ఇష్ట దైవాన్ని తల్చుకుని, “నాయనా, నా మనసు సంకల్పించి లేదు, ఒక వేళ ఇతనికి నిజంగా కష్టం వస్తే, ఎవరో ఒకరి ద్వారా, అది నేనైనా కావచ్చు, ఆదుకో, అనుకోండి”. ప్రక్రుతి మీ భావాన్ని సవీకరిస్తుంది. ప్రతి సారి అదే చేస్తే అది మీ తర్కం అవుతుంది, భావం అవదు, గుర్తు పెట్టుకోండి, దానికి ప్రకృతిలో విలువ లేదు! ఇది సమాజ, లేదా దేశ ప్రజా రక్షణ!

స్పందన లేనిది హృదయం కాదు, స్పందనకు అర్ధం “డబ్బు, సరుకులు” ముట్టచెప్పమని కాదు! స్పందన కలిగిన రోజున మనస్సు చెప్తుంది ఏమి చేయాలో.

సంస్కృతి పరిరక్షణార్ధం దానం

మన సాంస్కృతిక సంపద అంటే వేదం, పురాణం, పౌరోహిత్యం, కళలు (నాట్యం, సంగీతం, ఇతరత్రా) కాపాడే వాళ్ళను మనం ఆదుకోవాలి. మనకు మన సంస్కృతి అంటే ఇష్టం ఉండాలి ముందు, కదూ? అది ఇంకా నడవాలి, ఉద్దరింపబడాలి అనుకుంటే, ఊరికే జరగదు కదా? అందరికీ అది చేతకాదు. దేశ సంస్కృతిని నడిపించే వారు ఉదా: పౌరోహిత్యం చేసే బ్రాహ్మణులు, నాట్యకారులను, సంగీత విద్వాంసులను, చిత్రకారులను, హరిదాసులను, గంగిరెద్దు వారు (ఇందులో ఎవరికి ఎవరితోటి పోలిక లేదు సుమీ, అందరూ సంస్కృతిని, ఆచారాలను నిలబెడుతున్నవారు, కొంత మంది విద్యా నేర్చారు, కొంతమంది విద్యతో కాకుండా, జీవన శైలితో సంస్కృతికి అందాన్ని తెచ్చారు), వీరికి చేతనైనప్పుడు కాస్త ప్రోత్సాహం ఇస్తుండాలి! హయ్యబాబోయ్, ఇన్ని దానలా ? అని అనిపించచ్చు. చేయకండి… కానీ మీ మనస్సు స్పందించేలా చూసుకోండి, బాధ్యతలు తెలుసుకోండి. అంతే, ఏమి జరగాలో అవి జరుగుతాయి!

ప్రకృతి పరిరక్షణార్ధం దానం

ప్రకృతి పరిరక్షణ లో భాగంగా, చెట్లు నాటటం, రక్షించటం, పశు పక్ష్యాదులను రక్షించటం (ముఖ్యంగా గోవులు) ఇవే చేసేందుకు పూనుకోవాలి. లేదా ఇవి చేసే వాళ్ళకు మద్దతు ఇస్తుండాలి. ఎందుకంటే, భూమి పైన మనిషి లేకపోతే, భూమి వికసించి సంతోషిస్తుంది, అన్నీ ప్రాణులు ఊపిరి పీల్చుకుని నిర్భయంగా బ్రతుకుతాయి. కానీ చిన్న క్రిమి కీటకాలు నశిస్తే, మనిషి కొద్ది నెలల్లో నసిస్తాడు. ఈ చేదు నిజం మనం తెలుసుకోవాలి, అప్పుడు పశు పక్ష్యాదులు ఎంత మనకు అవసరమో ఇట్టే తెలుస్తుంది.

ట్రస్టులు, ఫౌండేషన్లు వారికి చేయూత

ఇవేవీ మీకు కుదరట్లేదు, మంచి, చేడు విశ్లేషించలేకపోతున్నారు, మిగిలింది ఇక ట్రస్టులు, ఫౌండేషన్లు, NGO లు, కొన్ని నమ్మకంగా పని చేస్తుంటాయి, తప్పు లేదు, మీరు నమ్మిన వాటికి నిర్భయంగా చేయూత ఇచ్చే దానం చేయచ్చు. వాళ్ళు అతి తక్కువ రుసుము ఆ వ్యవస్థ పనిచేయటానికి ఉపయోగిస్తూ, మిగిలింది వాళ్ళు అనుకున్న సమాజ శ్రేయస్కర పనికి వినియోగిస్తారు. ముందు వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లు, వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఆన్ని సరి చూసుకుని వాళ్ళకి సహాయ పడండి.

దానంలో రకాలు

మీరు శక్తి దానం చేయచ్చు, యుక్తి దానం చేయచ్చు, ధనం , ధాన్యం, వస్త్రం, విద్య, జ్ఞానం, శరీర భాగం, ఏవి ఏ సందర్భానికి ఉపయోగ పడతాయో, అవి దానం చేయచ్చు. ఇది ముఖ్యంగా పొందేవారి జీవితం పెద్దగా మారకపోయినా, వారి కృతజ్ఞతా భావం వలన, చేసేవారి స్పందించే మనస్సు వలన, మానసిక స్థితి బాగుపడటానికి, ఆధ్యాత్మిక బాటలో, కొన్ని అడుగులు ముందుకు పోవటానికి దోహద పడుతుంది అనటానికి ఎటువంటి సంకోచం అక్కర్లేదు!

ఈ వ్యాసం మీకు ఉపయోగపడితే, తప్పక మరి కొంత మందితో పంచండి, మీ కామెంట్స్ పెట్టండి


Share this with people you care for

Do you want to receive an email when I post a new article?

Reading makes us committed to life to evolve. And I am a life coach, to whom you don't need to pay anything. Whenever I post a new article, (English/Telugu), do you want to receive an email? The following topics are usually covered. Optionally you can also select Software, 3D modelling and Education related content.

  • Health, Mind, Dharma, Society, Leadership etc
Close this popup

I don't spam, nor I do business, with people who are interested in Articles alone.