ఎదురు చెప్పే పిల్లలకు ఉపయోగ పడే కధ!

Share this with people you care for

అనగనగా, ఒక ఊళ్ళో సుబ్బయ్య అనే పెద్ద వ్యాపారికి ముగ్గురు కొడుకులు వుండేవాళ్ళు. ఒక పెద్దవాడు, కృష్ణుడు, ఇద్దరు కవలలు, రాముడు, భీముడు . రాముడు భీముడు కవలలైనా , ఇద్దరూ భిన్న ధ్రువాలు. రాముడు అమాయకుడు, కానీ, భీముడు కొంచెం పెంకివాడు, ఎవరు చెప్పినా వినేరకం కాదు. మాటకు మాట చెప్పేవాడు. ఇది చూసి రాముడు కూడా అదే చేస్తుండేవాడు. కృష్ణుడు కొంచెం నెమ్మదస్తుడు, అలోచించి అడుగు వేసేవాడు.

వీళ్ళ ముగ్గురుకి యుక్తవయస్సు వచ్చింది. ఒక ఏడాది రెండేళ్లు అంతరం, అంతే. ముందు ప్రయోజకుడు ఎవరో తెలుసుకుని తన వ్యాపారం ఇవ్వాలనుకున్నాడు. కృష్ణుడు నెమ్మదస్తుడు, వాడికి ఇవ్వాలా, లేక భీముడు గడుసు వాడు వాడికి ఇవ్వాలా అని ఆలోచిస్తూ, వాళ్ళకి ఒక పరీక్ష పెడదామని అనుకున్నాడు.

ఊరికి సామాను తేవాలంటే, అడివి దాటి, వెళ్లి, పట్టణం నుంచి సామాను తేవాలి. ఒక పది మైళ్ళు అడివి ఉంటుంది. అడివిలో కొన్ని చోట్ల రకరకాల జంతువులూ ఉంటాయి, కొన్ని చోట్ల దొంగలు వుంటారు.

ముగ్గురిని పిలిచి మూడు వేర్వేరు దినాల్లో పట్టణానికి వెళ్లి సరుకు తేవాలి అని చెప్పాడు. భీముడు, నేనెందుకు తేవాలి, నేను తేను, పని వాళ్ళ చేత తెప్పించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. రాముడుకి ఆలా చెప్పే ధైర్యం లేక తల ఊపాడు, కానీ భీముడిలా వుండాలని మనసులో కోరిక. ఇక కృష్ణుడు తండ్రి మాట మీద గౌరవంతో సరే అన్నాడు. వాళ్ళకి మూడేసి కాయితం మడతలు ఇచ్చి, ఇవి చదవి అనుసరించండి అన్నాడు. సరుకుల పేర్లు వేరేగా రాసి, డబ్బు ఇద్దరికీ ఇచ్చి పంపాడు.

రాముడికి, తన అన్న భీముడిలా చెప్పలేకపోయానే అని మనసులో బాధగా వుంది, అడివి వరకు వెళ్లి, కనీసం నాన్న ఇచ్చి పాటించమన్న కాగితాలు అయినా విసిరి కొడదాం అని నలిపి పారేసి, అడివిలోకి వెళ్ళాడు, కొంత దూరం వెళ్లేసరికి దొంగలు ఎదురుపడి, బెదిరించి మొత్తం డబ్బు దోచుకు పోయారు. ఇంక డబ్బులేక, వెనుదిరిగి, ఇంటికి చేరి, జరిగింది చెప్పాడు! తండ్రి వాడి తెలివితక్కువ తనానికి బాధ పడ్డాడు!

కృష్ణుడు, అడివి దాకా వెళ్లకుండా, ఇంట్లోనే కాగితం చదివాడు. అందులో దొంగలు వుండే ప్రదేశం తండ్రి రాసి, డబ్బును సరైన చోట బండిలో దాచమని చెప్పాడు. అందుకు కృష్ణుడు, ఎడ్లబండి ఇరుసు తీసి, అక్కడ ఒక డబ్బాను అమర్చి, అందులో డబ్బు పెట్టి, ఇరుసు బిగించి, ఒక పేదవాడి వేషం వేసుకున్నాడు. రెండో కాగితం చదివాడు. అందులో క్రూర జంతువులు వచ్చే ప్రదేశం వుంది, జంతువులకి నిప్పు అంటే భయం కాబట్టి, ఒక కాగడా పెట్టుకున్నాడు. ఇక మూడోది, రాత్రి ప్రయాణం వద్దు, వచ్చేప్పుడు, ఇద్దరు పహారా వ్యక్తుల్ని తెచ్చుకో, వాళ్లకు మనం భోజనం పెట్టి పంపిద్దాం అన్ని వ్రాసి వుంది.

దీనికోసం కృష్ణుడు మిట్టమధ్యాహ్నం బయలుదేరాడు, ఊళ్ళో ఒక బలమైనవాడిని చూసుకుని, జబ్బువాడిలా బండిలో పడుకోబెట్టుకుని, అడివిలోంచి తీసుకెళ్లాడు, దొంగలు అటకాయిస్తే, జబ్బుమనిషిని చూపించి సహాయం చేయమన్నాడు, వైద్యం కోసం పట్టణం వెళ్తున్నట్టు చెప్పి, వాళ్ళ దగ్గర్నుంచే ఒక పది కాసులు తీసుకున్నాడు.

ఎండ ఉండగానే జంతువుల ప్రదేశం దాటి, పట్టణంలో సరుకులు కొనుక్కుని, సత్రంలో రాత్రి బస చేసి, తిరుగు ప్రయాణంలో మల్లి దొంగలు ఎదురైతే, వాళ్లకు మెరుగైన తన స్నేహితుడిని చూపించి, వాళ్ళు చేసిన సహాయానికి, ఒక బియ్యం బస్తా ఇచ్చాడు. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తానని చెప్పాడు. వాళ్ళు కూడా ఆనందపడి, వాళ్ళను వదిలేశారు. ఇంటికి చేరి, తండ్రికి జరిగిన కధ చెప్తే, తండ్రి ఆనంద భరితుడై, వ్యాపారం పెద్ద కొడుక్కి కట్టబెట్టాడు.

ఇక్కడ మనం నేర్చుకోవాలిసినవి, మన పిల్లలకు చెప్పవలిసినవి కొన్ని వున్నాయి

1. మొదటగా, పద్యం, వినదగునెవ్వరు చెప్పిన, వినినంతయు వేగిపడక, వివరింపఁదగున్! అంటే ఎవరు చెప్పినా మొదట వినాలి, తర్వాత విచక్షణ ఉపయోగించి అలోచించి అడుగు వేయాలి. ఇక్కడ, తండ్రి మాట కూడా వినకుండా, భీముడు ధైర్యవంతుడు అయినా, అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు.

2. మనకు నచ్చిన వాళ్ళను అనుకరించటం ఎంత చేటు అనేది, రాముడి జీవితం చెప్తుంది. అమాయకుడు, కానీ కృష్ణుడిని కాకుండా, భీముడిని అనుకరించటానికి బయలుదేరి, దెబ్బ తిన్నాడు. అదృష్టం, బ్రతికి బట్ట కట్టాడు. “సరి” ని అనుకరించాలి, “ఇష్టాన్ని” కాదు. విలువలు లేనివారిని, ఇష్ట పడకూడదు, మనకు తెలియకుండా అనుకరిస్తాము.

3. మీ తెలివి వికసించేది, కృష్ణుడిలా సరైన మార్గంలో వున్నప్పుడు. త్రోవ తెలియనప్పుడు, ప్రయాణం సాగిస్తే, సరైన గమ్యం చేరటం చాలావరకు జరగదు. చేరిన గమ్యం చాలావరకు సరైనది కాదు. త్రోవ తెలియనప్పుడు, చెప్పిన మాట వినాలి, ఆలోచించాలి, విశ్లేషించాలి, అప్పుడు ముందుకు సాగాలి. చెప్పిన వాళ్ళని అవమానిస్తే, ప్రక్రుతి చెప్పు తీసుకుని కొడుతుంది.

4. ఇక నా పిల్లలతో, నా దగ్గరకొచ్చే పిల్లలతో నేను చెప్పే మాటలు. ఓర్పు ఉంటే చదవండి, ఎందుకంటే, ఇక్కడ ఆడ, మగ అందరికి వర్తిస్తాయి

నేను : బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏమిటి?

పిల్లలు: ఉన్నవాళ్ళల్లో బెస్ట్ అని అర్ధం!

నేను: అంటే ఏంటి?

పిల్లలు: అంటే చాలా ఇష్టం అని!

నేను: బాగుంది, ఎందుకు అంత ఇష్ట పడతాము?మనకు నచ్చినవి మాట్లాడతారు, మనకు సపోర్ట్ చేస్తారు, ఏదున్నా మనతో షేర్ చేసుకుంటారు, ఒక్కోసారి, మనకు ఇచ్చాకే వాళ్ళు తీసుకుంటారు… అవునా?

పిల్లలు: అవును , అయితే…

నేను : ఒకవేళ నువ్వు తెలియకుండా ఒక పులి వున్నా అడివిలోకి వెళ్తుంటే , అప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ కి అది తెలిస్తే ఏమి చేస్తాడు

పిల్లలు: వెళ్ళద్దంటాడు, ఆపేస్తాడు.

నేను: అప్పుడు, ఆపేసినందుకు నీకు కోపం వస్తుందా?

పిల్లలు: మొదట వస్తుంది, తర్వాత తెలుసుకుని కోపం పోతుంది.

నేను: ఇప్పుడు మీ తలిదండ్రులను చూడండి, మీకు పెడితే గాని తినరు, మీకు సపోర్ట్ చేస్తారు, నచ్చినవి చేస్తారు, మాట్లాడతారు. ఒక్కోసారి ఇలా చెయ్యి, ఆలా చెయ్యకు అంటారు, అంటే అది బహుశా మీకు ఇబ్బంది రాకూడదు అని చెప్తున్నారు. వాళ్ళు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ కాదా?

పిల్లలు: ఆఁ

నేను: మరి ఎందుకు తిరిగి భీముడి లాగ, రాముడి లాగ, మాటకి మాట చెప్తారు? అప్పుడు వాళ్ళు చెప్పటం మానేస్తారు, అప్పుడు మీరు భీముడిలా ఏ లాభం లేకుండా వుంది పోతారు, లేదా, రాముడిలా నష్టపోతారు!

పిల్లలు: కానీ మాకు అన్ని తెలుసు.

నేను: మీ వయస్సు ఎంత?

పిల్లలు: 15,16,18…

నేను: సరే, ఒక 5 ఏళ్ళ క్రిందట మీకు ఇన్ని విషయాలు తెలుసా?

పిల్లలు: లేదు అప్పుడు తెలియదు

నేను: అంటే, ఇంకో పదేళ్లకు మీకు ఇంకా తెలుస్తాయా? లేకపోతె, ఇప్పుడు తెలిసినవి సరిపోతాయా?

పిల్లలు: కొత్తవి తెలుస్తాయి.

నేను: మరి 5 ఏళ్ళల్లో మీకు ఇన్ని విషయాలు తెలిస్తే, ఇంకో 25 ఏళ్ళు మీకంటే పెద్దవాళ్ళు వాళ్లకి చాలా విషయాలు తెలుసు కదా? మీకు చెప్తే నష్టం ఏంటి?

పిల్లలు: మేము సొంతంగా నేర్చుకోవాలి

నేను: బాగుంది చాలా చోట్ల మీరే నేర్చుకోవాలి, అదే సరైన పని. ఇప్పుడు, మీకు పులి దగ్గరకు వెళ్తే కరుస్తుంది అని తెలియదు అనుకుందాం, అది మీకు మీరుగా తెలుసుకోవాలని అనుకుంటున్నారా,ఎవరైనా ముందే చెప్తే మంచిది అనుకుంటున్నారా?

పిల్లలు: …. mmm… ముందు చెప్తే దాని దగ్గరకు వెళ్ళం

నేను: అదే కదా వాళ్ళు చేస్తుంటారు?

పిల్లలు: చెప్పిందే చెప్తారు, తిడతారు

నేను : మీరు వద్దన్నా పులి దగ్గరకు వెళ్తే, మళ్లీ మళ్ళీ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు మీ బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే చెప్పింది వింటే, ఇంకోసారి చెప్పరు, తిట్టరు.

పిల్లలు: నాకు చెప్పించుకోవటం ఇష్టం ఉండదు

నేను: శభాష్. అప్పుడు తెలియనివి తెలుసుకుని పాటించాలి, చెప్పేవరకు తెచ్చుకోకూడదు, తెలియనివి తెలిసినట్టుగా అడుగు వెయ్యకూడదు, అప్పుడే ఊబిని నేల అనుకుని అడుగేస్తాం! బయటకు రాలేనంతగా కూరుకుపోతాం !

మీకు సృష్టి ఇచ్చిన బెస్ట్ ఫ్రెండ్స్, మీ తలిదండ్రులు, దురదృష్టం, ఏమిటంటే, మీకు దారి చూపించి, మీకంటే ముందు, వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు మీ చిన్నప్పుడు పొగరుతో వాళ్ళని విసుక్కుని, పెద్దయ్యాక జీవితంలో మునిగి పోయి వాళ్ళను ఈసడించుకుని, చివరికి ఏ వృద్ధాశ్రమం లోనో పడేసి, “వరస్ట్ ఎనిమి” అన్నట్టు చూస్తారు. అయినా వాళ్ళు మీ మంచే కోరతారు, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ కదా? మీరు అలాంటి వారికి కనీసం ఫ్రెండ్స్ అవగలరా?

ఇది మీకు మీరుగా, చేయగలిగిన పని. పెద్దల మాట చద్ది మూట అంటే, బలం, సుదీర్ఘ ఆరోగ్యం కలిగి వున్న విషయాలు అని, ముందుచూపు, జాగ్రత్త, ఆలోచన కలిగినవి అని. వాటిని అశ్రద్ధ చేస్తే, పులి చేత కరిపించుకున్నాకే మీకు తెలుస్తుంది, పులి కరుస్తుంది అని, అప్పటికి సమయం మించిపోగలదు !

మీ తెలివి వికసించేది, కృష్ణుడిలా సరైన మార్గంలో వున్నప్పుడు! పెడత్రోవలో ఉంటే మీ తెలివి వలన బూతు, రక్తపాతపు, విద్వేషపూరిత, వివక్ష పూరిత సినిమాలు తీసుకుంటూ చూసుకుంటూ , వక్ర భాష్యాలు వింటూ, చెప్తూ, రౌడీల్లా, మారి లేదా తీవ్రవాదాన్ని ఆస్వాదిస్తూ పాలు పంచుకుంటూ బ్రతుకులు పాడుచేసుకుని, ఇతరుల జీవితాలు నాశనం చేస్తారు. అందుకే ఎదురు చెప్పకండి, వారు చెప్పేది సరిగ్గా లేకపొతే తర్వాత మీ ఆలోచన చెప్పండి, లేదా వదిలేయండి.

పిల్లలు: …..

పిల్లలు: మా నాన్న అబద్ధాలు ఆడతాడు, ట్రాఫిక్ ఎదురు వెళ్తాడు, వాళ్ళ మాట మంచి అని ఎలా అనుకునేది ?

నేను: నా దగ్గరకు తీసుకురండి, కానీ, వాళ్లకి ఇతరుల శ్రేయస్స్సు సంబంధం లేదు, మీ శ్రేయస్సు తప్పకుండా కావాలి. ఎప్పటికి వాళ్ళు మీకు బెస్ట్ ఫ్రెండ్స్!

ఇది దురదృష్టకరం. “బుద్ధి లేని” వారు కన్న సంతానం బుద్ధితో తయారవ్వాలని ఆకాంక్షించలేము… ఇలాంటి వాళ్ళకి నా దగ్గర మందు లేదు. ఎందుకంటే, మందు పని చేయటానికి శుభ్రమైన ప్రదేశం కావలి. మురుగు నీళ్ళల్లో తేలుతున్న మనిషికి నేను గాయానికి మందు రాయను


Share this with people you care for

Do you want to receive an email when I post a new article?

Reading makes us committed to life to evolve. And I am a life coach, to whom you don't need to pay anything. Whenever I post a new article, (English/Telugu), do you want to receive an email? The following topics are usually covered. Optionally you can also select Software, 3D modelling and Education related content.

  • Health, Mind, Dharma, Society, Leadership etc
Close this popup

I don't spam, nor I do business, with people who are interested in Articles alone.